హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఒక కోతి, మనిషిని పోలిన అతిభారీ ఆకారం తిరగటాన్ని చూశామంటూ దశాబ్దాలుగా కొందరు చెబుతూ వస్తున్నారు. తాజాగా తమకు హిమాలయాల్లో యతి (మంచు మనిషి) పాదముద్రలు కనిపించాయంటూ భారత సైనికుల బృందం తెలిపింది. దాంతో, ప్రపంచవ్యాప్తంగా యతి విషయం మరోసారి ఆసక్తికరంగా మారింది.
ఏప్రిల్ 9న హిమాలయ పర్వతాల్లోని మకలు బేస్ క్యాంప్ సమీపంలోని మకలు బరూన్ జాతీయ పార్కు వద్ద భారత సైనిక బృందానికి యతి సంచరించినట్లుగా పాదముద్రలు కనిపించాయని ఏప్రిల్ 29న భారత ఆర్మీ ట్వీట్ చేసింది.
ఆ పాదముద్రలు 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్నాయని పేర్కొంది. అందుకు సంబంధించి కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.
మంచు మనిషి కథేంటి?
మీరు హిమాలయ పర్వాతాల్లోకి వెళ్లకున్నా సరే, కొన్ని సినిమాల్లో యతీల ఫొటోలను చూడొచ్చు. దశాబ్దాలుగా సినిమాల్లో, వీడియో గేమ్‌లలో, టీవీ కార్యక్రమాల్లో శరీరమంతా జుట్టుతో కనిపించే ఆకారాలను చూపిస్తున్నారు.
భారీ శరీరం, విశాలమైన పాదాలు, పొడవాటి దంతాలు ఉన్నట్లుగా యతీలను చూపిస్తుంటారు. వాటి శరీరమంతా బూడిద లేదా తెలుపు రంగు జుట్టు ఉంటుంది. అవి మంచు పర్వతాల్లో ఒంటరిగా సంచరిస్తున్నట్లుగా చూపిస్తారు.
మరి, ఈ కల్పిత చిత్రాల వెనుక, ఊహాజనిత కథలకు మించి ప్రపంచానికి తెలియని వాస్తవం ఏమైనా ఉందా?
హాలీవుడ్ నటుడికి దొరికిన 'వేలు'
1921లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లిన బ్రిటన్ పర్వతారోహకుల బృందానికి ఛార్లెస్ హోవర్డ్ బరీ నాయకత్వం వహించారు. తనకు భారీ పాదముద్రలు కనిపించాయని ఆయన చెప్పారు. అవి 'ఎలుగుబంటి లాంటి మంచు మనిషి' పాదముద్రలు అయ్యుంటాయని తెలిపారు.
ఆ తర్వాత రానురాను యతీల జాడను కనుగొనాలన్న ఆసక్తి బాగా పెరిగింది. 1950ల్లో పలువురు పర్వతారోహకులు హిమాయాలయాల్లో సాహసయాత్ర చేపట్టారు.
అంతేకాదు, కొన్నేళ్ల క్రితమే హాలీవుడ్ స్టార్ జేమ్స్ స్టెవర్ట్ కూడా తనకు యతి వేలు దొరికందని చెప్పారు. అయితే, 2011లో జరిపిన డీఎన్‌ఏ పరీక్షల్లో అది మనిషి వేలు అని తేలింది.
ఆ తరువాత కూడా చాలామంది పర్వాతారోహకులు మంచు కొండల్లో పాదముద్రలు కనిపించాయని చెప్పారు. యతిల పుర్రెలు, ఎముకలు, వెంట్రుకల శాంపిల్లు లభించాయని కొందరు తెలిపారు. అయితే, పరీక్షల్లో అవి ఎలుగుబంట్లు, జింకలు, కోతుల్లాంటి వన్య ప్రాణులవని వెల్లడైంది.
ఇప్పటివరకు యతీల ఉనికికి సంబంధించి ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లభించలేదు. అయినా ఇంకా చాలామంది వాటి కోసం హిమాలయాల్లో వెతుకుతూనే ఉన్నారు.
అలా యతిల కోసం ఎక్కువగా వెతికిన వారిలో పర్వతారోహకుడు రెయిన్‌హోల్డ్ మెస్స్‌నెర్ ఒకరు. తాను 1980ల్లో ఒకసారి యతిని చూశానని, అనంతరం ఆ మిస్టరీని ఛేదించేందుకు పదుల సార్లు ప్రయత్నించానని తెలిపారు. ఆఖరికి యతి అనేది ఒక ఎలుగుబంటి అని చెప్పారు.
యతీలవిగా భావించిన వెంట్రుకల శాంపిళ్లను బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యుశాస్త్ర నిపుణులు, రిటైర్డ్ ప్రొఫెసర్ బ్రియాన్ సైకెస్, తన బృందంతో కలిసి పరీక్షించారు.
ఆ వెంట్రుకల డీఎన్‌ఏను, ఇతర జంతువుల జన్యువులతో పోల్చి చూశారు. ఆ శాంపిళ్లలో ఒకటి భారత్‌లోని లడక్ నుంచి, మరొకటి భూటాన్ నుంచి సేకరించారు. వాటిలోని జన్యువులు 40,000 ఏళ్ల క్రితం ఉనికిలో ఉన్న ధ్రువపు ఎలుగుబంట్ల జన్యువులను పోలి ఉన్నాయని వారి పరీక్షల్లో వెల్లడైంది. దాంతో, హిమాలయాల్లో ప్రపంచానికి తెలియని ఎలుగుబంట్లు జీవిస్తున్నాయని అంతా భావించారు.
కానీ, తర్వాత ఆ పరీక్షల ఫలితాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హేగెన్‌కు చెందిన పరిశోధకులు మరోసారి పరీక్షలు చేశారు. ఆ వెంట్రుకల్లోని డీఎన్‌ఏ చెడిపోయిందని, దాంతో ప్రొఫెసర్ బ్రియాన్ సైకెస్ పరిశోధనా ఫలితాల్లో కచ్చితత్వం లోపించిందని తేల్చారు.
మరోవైపు, 2011లో రష్యాకు చెందిన పర్వతారోహకుల బృందం యతిల జాడకు సంబంధించి వాటి తమ వద్ద ఉన్నాయని తెలిపింది.
అయితే, అదే రష్యాకు చెందిన జంతుశాస్త్ర నిపుణులు, రచయిత డినెట్స్ మాత్రం యతి గురించి అంతా ప్రచార ఆర్భాటమే తప్ప వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. యతికి సంబంధించి ఎవరూ స్పష్టమైన ఆధారాలను కనిపెట్టలేదని అన్నారు.
"మంచు మనుషుల్లో" యతి ఒకటి.
యతి ఆకారానికి ప్రాచీన గ్రంథల్లోనూ స్థానం ఉంది. నేపాల్‌లోని షెర్పా తెగకు చెందిన పురాణాల్లో యతీలకు ప్రముఖ పాత్ర ఉంది. తూర్పు నేపాల్‌లోని 12,000 మీటర్ల ఎత్తులోని పర్వత ప్రాంతాల్లో షెర్పా తెగ ప్రజలు జీవిస్తున్నారు.
శివ ధాకల్ రాసిన అనే పుస్తకంలో 12 ఇతిహాసాలను ప్రస్తావించారు. ఆ కథల్లో యతీలను ప్రమాదకరమైన జీవులుగా చూపించారు.
యతీలకు, షెర్పా తెగ ప్రజలకు మధ్య భీకరమైన పోరు నడిచేదని వివరించారు. ఒక స్థానిక అమ్మాయిపై యతీలు అత్యాచారం చేసినట్లు, తర్వాత ఆమె అనారోగ్యం పాలైనట్లు కూడా ఒక కథలో చెప్పారు.
ఉదయాన సూర్యుడు పైకి వెళ్తున్నట్లుగా యతీలు అంతకంతకూ ఎత్తు పెరిగిపోతుంటే, అది చూసిన మనుషులు స్పృహ, శక్తి కోల్పోయారని మరో కథలో రాశారు.
ఆ ఇతిహాసాల ప్రధాన ఉద్దేశం సమాజానికి ప్రేరణ, నైతిక విలువలు నేర్పించడమే. ప్రత్యేకించి, షెర్పా తెగవారు ప్రమాదకరమైన వణ్య ప్రాణుల సమీపంలోకి వెళ్తున్నారని ఆ కథల ద్వారా హెచ్చరించారు.
"యతీల పురాణ కథలను ఒక హెచ్చరిక మాదిరిగా వినియోగించేవారు. షెర్పా తెగవారిలో నైతికత, ధర్మం అనే విలువలను పెంచేందుకు చెప్పేవారు. దాంతో, వారి పిల్లలు ఇతర ప్రాంతాల్లో సంచరించకుండా తమ సముదాయంలోనే ఒకేచోట సురక్షితంగా ఉండేవారు" అని రచయిత శివ ధాకల్ వివరించారు.
కొంతమంది మాత్రం యతి అనేది ఒక భయం మాత్రమేనని, పర్వత ప్రాంతాల ప్రజలు అత్యంత కఠినమైన వాతావరణంలో మరింత ధైర్యంగా ఉండేలా ఆ భయం వారిని దృఢంగా మార్చిందని అంటారు.
అయితే, అప్పుడప్పుడు పర్వతారోహకులు హిమాలయాల్లో పర్యటించినప్పుడు యతీల ఉనికికి సంబంధించిన విషయం చర్చనీయాంశమవుతోంది.
0 Comments