IMEI నెంబర్ గురించి పూర్తి సమాచారం..


IMEI నెంబర్ గురించి పూర్తి సమాచారం..



మనం కొనుగోలు చేసే ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ అనేది తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. భవిష్యత్ అవసరాలకు ఈ నెంబరు చాలా ఉపయోగపడుతుంది. ఫోన్ అపహరణకు గురైన సమయంలో దాన్ని పూర్తిగా లాక్ చేయాలన్నా, పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయించాలన్నా, మీ ఫోన్‌ను వేరొకరికి విక్రయించాలన్నా ఈ ఐఎమ్ఈఐ నెంబర్‌ అనేది చాలా కీలకం.

IMEI నెంబర్ అంటే ఏంటి..?

ఐఎమ్ఈఐ పూర్తి పేరు ఇంటర్నెషనల్ మొబైల్ స్టేషన్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ నెంబర్. ఈ 15 అంకెల కోడ్‌ను ప్రతి ఫోన్ పైనా వేరువేరుగా ముద్రించటం జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ నిమిత్తం ఈ కోడ్‌ను ప్రధానంగా ఉపయోగించటం జరుగుతోంది. రెండు సిమ్ స్లాట్‌లతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లలో రెండు ఐఎమ్ఈఐ నెంబర్‌లను మీరు చూడొచ్చు. ఐఎమ్ఈఐ నెంబర్‌లేని ఫోన్‌లను నకిలీ హ్యాండ్‌సెట్‌లగా గుర్తించాల్సి ఉంటుంది.



మొబైల్ ఫోన్‌లో IMEI నెంబర్‌ను తెలుసుకోవటం ఎలా..?

యూఎస్ఎస్‌డి కోడ్ ద్వారా ఫోన్ ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను తెలుసుకునే వీలుంటుంది. ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. మొబైల్ బాక్సు పైనా ఈ నెంబర్ కనిపిస్తుంది.

ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి తెలుసుకోవాలంటే..?

ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్‌లోని Settings > About > IMEIలోకి వెళ్లటం ద్వారా ఐఎమ్ఈఐ నెంబర్‌ను తెలుసుకోవచ్చు. ఐఫోన్ యూజర్లు తమ ఫోన్‌లోని Settings > General > Aboutలోకి వెళ్లి IMEI నెంబర్‌ను తెలుసుకోవచ్చు. చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లలో ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను ఫోన్ వెనుక భాగంలోని బ్యాటరీ క్రింద భాగంలో చూడొచ్చు.

మొబైల్‌ను గుర్తించటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలకం..

ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను గుర్తించటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఇటీవల ఓ కేసు విచారణలో భాగంగా ఒకటే IMEI నెంబర్‌ను కలిగి ఉన్న 18000 ఫోన్‌లను టెలికామ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిసోర్స్ అండ్ మానిటరింగ్ సెల్ గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో
IMEI ట్యాంపరింగ్‌కు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకునేందుకు టెలికం శాఖ సిద్ధమవుతోంది. సిద్ధం చేస్తున్న కొత్త రూల్స్ ప్రకారం ఐఎమ్ఈఐ నెంబర్ ట్యాంపరింగ్‌కు పాల్పడే వారు 3 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కోవల్సి ఉంటుంది.
ఐఎమ్ఈఐ నెంబర్ ద్వారా మొబైల్‌ను బ్లాక్ చేయటం ఎలా..?

ఐఎమ్ఈఐ నెంబర్ ను ఉపయోగించుకుని మొబైల్ ను బ్లాక్ చేయటం చాల సులువు. ఈ ప్రక్రియను నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా ఫోన్ చోరీకి గురైన సమయంలో ఇది ఉపయోగపడుతుంది.
స్టెప్ 1 : ముందుగా ఫోన్ ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్‌ను మీ దగ్గర పెట్టుకోండి.
స్టెప్ 2 : మీ నెట్ వర్క్ ఆపరేటర్ వద్దకు వెళ్లండి.
స్టెప్ 3 : వారికి జరిగినదంతా వివరించి ఫోన్‌ను బ్లాక్ చేసేందుకు అవసరమైన ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్‌ వివరాలను ప్రొవైడ్ చేయండి.
స్టెప్ 4 : తద్వారా మీ ఫోన్ నిమిషాల్లో బ్లాక్ చేయబడుతుంది.




Post a Comment

0 Comments